రామగుండం, ఆగస్టు 6 (పల్లె వెలుగు/బీబీఎంఏ న్యూస్): చుండూరు దళిత అమరవీరుల స్ఫూర్తితో దళితులు ప్రతిఘటన పోరాటాలను మరింత బలోపేతం చేసుకోవాలని, స్వతంత్ర రాజ్యాధికార సాధన ద్వారానే దళితులకు నిజమైన విముక్తి లభిస్తుందని దళిత బహుజన పార్టీ (డీబీపీ) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు.
చుండూరు దళిత అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డీబీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, 1991 ఆగస్టు 6న చుండూరులో జరిగిన దళితుల హత్యాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని గుర్తు చేశారు. ఈ ఘటనలో 11 మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారని తెలిపారు. న్యాయపరమైన పరిణామాల వల్ల బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు.
చుండూరు అమరవీరుల పోరాట స్ఫూర్తితో దళితులు సంఘటితమై ప్రతిఘటించాలని, ఆత్మరక్షణతో పాటు రాజకీయ సాధికారత కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మోహనరావు, డీబీఎస్‌ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇటికాల గణేష్, ముక్క స్వామిదాస్, నక్కా దేవేందర్‌రావు, నిమ్మల శ్రీహరి, బత్తుల సత్యనారాయణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.