కరీంనగర్ ఆగస్టు 6
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ అర్హతల నిబంధనలు పేదలు, వృద్ధులు, వితంతు మహిళలు , నిజమైన అర్హుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ప్రత్యేకంగా 70 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం అత్యంత అన్యాయమైన నిర్ణయమని, 57 సంవత్సరాల వయస్సు దాటిన ఎంతో మంది పేద వృద్ధులు పని చేయలేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కాబట్టి వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును 70 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. వితంతు మహిళలకు 40 సంవత్సరాల వయోపరిమితి విధించడం పూర్తిగా అన్యాయమని, భర్తను కోల్పోయిన మహిళ ఏ వయస్సులో ఉన్నా ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఎలాంటి వయోపరిమితి లేకుండా అర్హులైన ప్రతి వితంతు మహిళకు పెన్షన్ అందించాలని కోరారు.ప్రభుత్వం ప్రకటించిన ఇతర అర్హత నిబంధనలను కూడా పునఃసమీక్షించి, నిజమైన పేదలకు న్యాయం జరిగేలా తక్షణమే సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజల విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోకపోతే, ఈ అన్యాయమైన నిబంధనలను ఉపసంహరించుకోకపోతే, భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహించి ప్రజల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.