మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జయంతి, వర్ధంతి కార్యక్రమాలు.. ఘనంగా నివాళులు

కాటారం, ఆగస్టు 6 (బీబీఎంఏ న్యూస్): మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను గణాంకాలు, చారిత్రక ఆధారాలతో ప్రజలకు వివరించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలమైన పునాది వేశారని అన్నారు.

గద్దర్ తన పాటలు, కవిత్వం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి, సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడిగా చిరస్మరణీయులని పేర్కొన్నారు. మహనీయుల సేవలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధి, ప్రజాసేవ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జయశంకర్, గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.