హైదరాబాద్, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):
హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాపై కొత్త వంతెన ఏర్పాటు పనుల నేపథ్యంలో జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
నగర జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) Joel Davis విడుదల చేసిన ప్రకటనలో, హిమాయత్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరాపార్కు వైపు వెళ్లే సాధారణ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నట్లు తెలిపారు.
వంతెన నిర్మాణ పనులు సజావుగా సాగేందుకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. సంబంధిత ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకుని, ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించి, అనవసర ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.