పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, క్రైమ్ ప్రాపర్టీ భద్రతపై ప్రత్యేక ఆదేశాలు

మంచిర్యాల, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):
పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు క్రైమ్ వాహనాలు, కేసు ప్రాపర్టీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ Ambar Kishore Jha అధికారులకు సూచించారు.

శనివారం మంచిర్యాల జోన్ పరిధిలోని దండేపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా సందర్శించి స్టేషన్ పనితీరును సమీక్షించారు. స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, ఐటీ విభాగం, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఎస్‌ఐ రాజవర్ధన్‌ను స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పోలీసు సిబ్బంది సమస్యలను కూడా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, 5ఎస్ విధానాన్ని అమలు చేస్తూ పోలీస్ స్టేషన్‌ను విభాగాల వారీగా విభజించి సిబ్బందికి బాధ్యతలు కేటాయించాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

అలాగే క్రైమ్ వాహనాలు, కేసు ప్రాపర్టీల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు. ఎలాంటి పెండింగ్‌లు లేకుండా కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ చేపట్టాలని సూచించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు.