సింగరేణిలో వేల కోట్ల అక్రమాలు.. బొగ్గు మాయం, థర్మల్ ప్రాజెక్టుపై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):
సింగరేణి సంస్థ నిర్వహణపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే T. Harish Rao తీవ్ర ఆరోపణలు చేశారు. జైపూర్‌లో ఏర్పాటు చేస్తున్న 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ విషయంలో నిబంధనలను విస్మరించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) లేదని, డీపీఆర్‌కు కూడా ఆమోదం లభించలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయినప్పటికీ టెండర్లు పిలిచి, తమ అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టి ఇప్పటికే సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

రాజస్థాన్ ప్రభుత్వంతో 76:24 నిష్పత్తిలో ఒప్పందం కుదుర్చుకున్నారని, అందులో 24 శాతం వాటా కింద పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని జైసల్మేర్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి ఇస్తామని చెప్పారని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ అయిన సింగరేణి జైసల్మేర్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నారని, "దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలనే" ఆలోచనతో సింగరేణిని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రాజస్థాన్ విద్యుత్ కొనుగోలు చేస్తుంటే, తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే భూపాలపల్లి గనుల్లో బొగ్గు నిల్వలపై కూడా హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లిలో తాము బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు వెళ్లగా మైన్ సేఫ్టీ పేరుతో అడ్డుకున్నారని ఆరోపించారు. అక్కడ మూడు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు కనిపించలేదని, బొగ్గు మాయమైందని తెలిపారు.

ఈ విషయం బయటపెట్టిన తర్వాత దానిని కప్పిపుచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, లేని బొగ్గును స్టాక్‌గా చూపిస్తూ రికార్డులు సర్దుబాటు చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం, భూపాలపల్లి గనుల్లో లేని బొగ్గును ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి పోస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

సింగరేణిలో జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు.