కూలిన స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్‌.. నేలకు దగ్గరగా వేలాడుతున్న విద్యుత్ తీగలు

ఎండపల్లి, బీబీఎంఏ న్యూస్, జూన్ 13:
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామం నుంచి ఎండపల్లి వెళ్లే రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావి వద్ద శుక్రవారం సాయంత్రం వీచిన బలమైన గాలులకు విద్యుత్ స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్ కూలిపోయాయి. అయితే ఘటన జరిగి ఒక రోజు గడిచినా విద్యుత్ శాఖ అధికారులు మరమ్మత్తు చర్యలు చేపట్టకపోవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారిపై నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగుతుండగా, రైతులు మరియు పశువులు కూడా ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నారు. కూలిపోయిన స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించకపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా, విద్యుత్ తీగలు నేలకు అత్యంత సమీపంలో వేలాడుతూ ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి చేతులకు తగిలేంత ఎత్తులో విద్యుత్ తీగలు ఉండటం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.

ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని గ్రామస్తులు ఆరోపించారు. మండలంలోని పలు గ్రామాల్లో కూడా విద్యుత్ స్తంభాలు, తీగల నిర్వహణలో నిర్లక్ష్యం కొనసాగుతోందని పేర్కొన్నారు.

ప్రమాదం జరిగే ముందే కూలిపోయిన స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్‌ను పునరుద్ధరించి, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

"ప్రాణనష్టం జరిగితే అందుకు పూర్తి బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదే" అని రైతులు స్పష్టం చేశారు.