హైదరాబాద్ | బిబిఎంఏ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎంఎస్. నెం.10 ద్వారా మేదరి (మహేంద్ర) కులాన్ని డీనోటిఫైడ్, నోమాడిక్, సెమీ-నోమాడిక్ (DNT) కమ్యూనిటీల జాబితాలో అధికారికంగా చేర్చినందుకు తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులో గ్రూప్-ఏ, సీరియల్ నంబర్ 14 వద్ద మేదరి (మహేంద్ర) పేరును చేర్చినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోరీగల శ్రీనివాస్ తెలిపారు. ఈ నిర్ణయం మేదరి మహేంద్ర సమాజ అభ్యున్నతికి చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ గుర్తింపుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీడ్ పథకం సహా DNT, నోమాడిక్, సెమీ-నోమాడిక్ కమ్యూనిటీలకు సంబంధించిన వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. అలాగే విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ప్రత్యేక అవకాశాలు లభించి సామాజిక, ఆర్థిక సాధికారతకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విజయానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం చేసిన నిరంతర పోరాటం, ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు మరియు సమాజ ప్రతినిధుల కృషే కారణమని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సమాజ సమగ్ర అభివృద్ధి కోసం సంఘం కృషి కొనసాగిస్తుందని జోరీగల శ్రీనివాస్ తెలిపారు.