బిబిఎంఎ న్యూస్ /సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
ఆలయానికి చేరుకున్న మల్క కొమరయ్యకు అర్చకులు సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మోదీ పేరుతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించగా, దేశానికి మరిన్ని సంవత్సరాలు సేవ చేసేలా ప్రధాని మోదీకి మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కొమరయ్య మాట్లాడుతూ, “ప్రజా సేవనే పరమావధిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషి భారత చరిత్రలో స్ఫూర్తిదాయకం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నాం” అని పేర్కొన్నారు.
పూజల అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్సీకి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.