హనుమకొండ, బీబీఎంఏ న్యూస్, జూన్ 12:
దేశంలో నాలుగోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ ఓటర్ల జాబితాల ద్వారా ప్రమాదకర రాజకీయాలకు పాల్పడుతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి చర్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూత్ స్థాయి నాయకులకు అవగాహన కల్పించారు.
సమావేశంలో మాట్లాడిన డాక్టర్ కడియం కావ్య, ప్రజల మద్దతుతో గెలవలేని పరిస్థితుల్లో బీజేపీ ఓటర్ల జాబితాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. SIR పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే యత్నాలను క్షేత్రస్థాయిలో అడ్డుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
ఓటర్ల జాబితానే ఎన్నికల విజయానికి తొలి అడుగని, ప్రతి BLA పార్టీకి సైనికుడిలా పనిచేయాలని ఆమె అన్నారు. రాబోయే మూడు నెలల పాటు ఇంటింటికీ వెళ్లి ఓటర్ వెరిఫికేషన్ నిర్వహించాలని, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, అన్యాయంగా తొలగించబడిన పేర్ల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ అంటే ప్రజాస్వామ్య పరిరక్షణేనని చెప్పారు. ఈ అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.
అనంతరం డాక్టర్ కడియం కావ్య రూపొందించిన "బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్" ను ఆవిష్కరించి BLAలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శంకర్ నాయక్, టీపీసీసీ నాయకులు నాగ సీతారాములు, దుద్దిళ్ల శ్రీనుబాబు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మహ్మద్ అయూబ్, ప్రియాంక అనిల్, పింగళి వెంకటరాం నరసింహారెడ్డి, దేవేందర్ రావు, సారంగపాణి, వివిధ మండల, బ్లాక్, డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.