రోడ్డు ప్రమాద బాధితులకు రూ.2.60 కోట్ల సహాయం ప్రకటించిన డా. షంషీర్ వయలిల్‌కు కృతజ్ఞతలు

దుబాయి, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): ఇటీవల దుబాయిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలు, గాయపడిన బాధితులకు భారీ ఆర్థిక సహాయం ప్రకటించిన బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్ డా. షంషీర్ వయలిల్‌కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు. డా. షంషీర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సంస్థ ప్రతినిధులను శుక్రవారం దుబాయిలో కలిసి అభినందించారు.

ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష దిర్హంలు (సుమారు రూ.26 లక్షలు) చొప్పున, గాయపడిన తొమ్మిది మందికి వైద్య సహాయం, పునరావాసం, పిల్లల విద్య కోసం మొత్తం 10 లక్షల దిర్హంలు (సుమారు రూ.2.60 కోట్లు) మానవతా సహాయ ప్యాకేజీ ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే కొనియాడారు.

ఈ సందర్భంగా డా. షంషీర్ వయలిల్‌తో పాటు బుర్జీల్ ప్రతినిధులను హైదరాబాద్‌కు ఆహ్వానించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేయాలని ప్రతిపాదించారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు జగిత్యాల జిల్లాకు చెందినవారని తెలిపారు.

అంతకుముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయిలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించి కాన్సులేట్ అధికారులతో సమావేశమై మృతదేహాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే రాషేద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించారు.