ఏడుగురు అరెస్ట్.. రూ.36,100 నగదు, 6 మొబైళ్లు, 6 బైక్‌లు స్వాధీనం

నక్కపల్లి, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.36,100 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఆరు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నక్కపల్లి ఎస్‌హెచ్‌వో మురళి ఆధ్వర్యంలో ఎస్సై సన్నీబాబు, సిబ్బంది గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉపమాక శివార్లలో కొందరు వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రాత్రి 11 గంటల సమయంలో దాడి నిర్వహించారు.

దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, జూదానికి ఉపయోగిస్తున్న నగదు, మొబైళ్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

జిల్లాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.